
అమరావతి: అమరావతిలో తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను తమకు కేటాయించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబుకి ప్రజాసమస్యల కంటే విలాసవంతమైన భవనాల కావాలా అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డీ విమర్శలు గుప్పించారు.
ఇక విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇస్తూ… విలాసవంతమైన భవనాలు ఊరికి ఒకటి చొప్పున ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసని విజయసాయి చెప్పనవసరం లేదని అన్నారు. అలాగే విజయసాయి చేసిన అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
ఈ నేపథ్యంలో నేడు మళ్ళీ విజయసాయి ట్విట్టర్ వేదికగా యనమలకి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
విజయసాయి ట్వీట్ : “యనమల గారూ… మీరు అడగటం, మేం ఇవ్వటం మొదలుపెడితే లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజీ, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వమని అడగగల సమర్ధులు మీరు!” అని అన్నారు.
ఆ తరువాత మరో ట్వీట్ పెడుతూ, “ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు గారూ? కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే పచ్చ మాఫియాను సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?” అని ప్రశ్నించారు.








