ఢిల్లీకి వైసీపీ బృందం.. చంద్రబాబుకి బ్యాండేనా..!?

11:55 am, Mon, 15 April 19
vijayasai-reddy-fires-on-chandrababu

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు ఏమాత్రం ఆగడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అప్పుడు మొదలైన విమర్శల పర్వం, పోలింగ్ ముగిసిన తరువాత కూడా కొనసాగుతూనే ఉంది.

ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘం అధికారులకి.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుపై ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్నికల రోజు వైసీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై  దాడులకు దిగారని చెప్పుకొచ్చారు.

సీఈసీతో వైఎస్సార్సీపీ బృందం భేటీ…

ఇక ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధమవుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి సోమవారం సీఈసీతో భేటీ అవనున్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వి.విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ మాజీ ఎంపీలతో కూడిన బృందం ఎన్నికల కమిషన్‌ను సాయంత్రం 5 గంటలకు కలవనున్నారు.

టీడీపీపై ఈసీకి ఫిర్యాదు…?

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు అండ చూసుకుని రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడింది చాలక మళ్లీ ఢిల్లీ వెళ్లి యాగీ చేస్తున్న తీరుపై వారు కమిషన్‌‌కు ఫిర్యాదు చేయబోతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలింగ్‌ రోజున, పోలింగ్‌ అనంతరం జరిగిన దాడులను ఈ సందర్భంగా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తారు.

విపక్షాల నేతలు ఇలా…

తాజాగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలిసొచ్చారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయన్నారు. వీవీ ప్యాట్ల స్లిప్పులు 50 శాతం లెక్కించాలని డిమాండ్ చేశారు.  టీడీపీ అధినేత చంద్రబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఆదివారం దీనిపై ఢిల్లీలో సమావేశమై చర్చించారు.

కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తీరు, ఈవీఎంలపై వస్తున్న అనుమానాలు, వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ, సుప్రీంకోర్టులో మళ్లీ రివ్యూ పిటిషన్‌ దాఖలు, ఈసీ పనితీరు వంటి అంశాలపై విపక్షాల నేతలు చర్చించారు.

బాబుకు గట్టి షాక్ ఇచ్చిన ఈసీ…

అయితే ఇప్పటికే చంద్రబాబుకి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా ఓటు వేయలేదని, దీనిని బట్టి చూస్తే.. ఏపీలో ఎన్నికల నిర్వహణ తీరును అర్థంచేసుకోవచ్చు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు చెంపపెట్టుగా..  గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేసిన వీడియోని ఈసీ రిలీజ్ చేసింది.

దీంతో చంద్రబాబు గాలి తీసేసినట్లయింది. మరి ఇప్పుడు వైసీపీ బృందం చేసే ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో, రాష్ట్రంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో తెలుసుకోవాలంటే.. కొంత కాలం వేచి చూడాల్సిందే!