మళ్లీ ప్రజా సంకల్పయాత్ర: విజయనగరం చేరుకున్నజగన్.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు..

- Advertisement -

 

ys-jagan-reached-vizag-again

విజయనగరం: విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తి దాడిలో గాయపడి కోలుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రను పున:ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈనెల 12 నుంచి జగన్ మళ్లీ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఆదివారం విశాఖపట్నానికి చేరుకున్న ఆయన.. విమానాశ్రయం నుంచి నేరుగా కారులో విజయనగరం జిల్లా మక్కువ మండలం చేరుకున్నారు.

కత్తి దాడిలో గాయాలపాలైన తరువాత తొలిసారిగా మళ్లీ విశాఖపట్నం చేరుకున్న జగన్‌ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు విశాఖ విమానాశ్రయం దగ్గరకు భారీగా తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బయటికి వచ్చిన జగన్‌కు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జై జగన్‌ అంటూ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జగన్‌కు దిష్టి తీసి, హారతులిచ్చి…

జగన్ కూడా అభిమానులకు, కార్యకర్తలకు చిరునవ్వుతో అభివాదం చేశారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన తన కాన్వాయ్‌లో విజయనగరం జిల్లా బయలుదేరారు. వైఎస్ జగన్‌ వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌ రెడ్డిలు ఉన్నారు.

విశాఖపట్నం నుంచి బయలుదేరిన జగన్ రోడ్డు మార్గం గుండా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలంలో ఏర్పాటు చేసిన పాదయాత్ర శిబిరం వద్దకు చేరుకున్నారు. కత్తిదాడిలో గాయాలపాలై 17 రోజుల విరామం తర్వాత మళ్లీ జగన్ ప్రజల్లోకి రావడంతో కార్యకర్తలు అభిమానులు ఆయనకు దిష్టి తీశారు. మహిళలు హారతిపట్టారు.

సోమవారం ఉదయం మక్కువ మండలం పాయకపాడు చేరుకోనున్న జగన్ ములపువలస నుంచి తన పాదయాత్రను పున:ప్రారంభిస్తారు. అక్కడ నుంచి మక్కువ క్రాస్ రోడ్, ములక్కాయలవలస మీదుగా కాశీపట్నం క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహిస్తారు.

మధ్యాహ్నం భోజన విరామం అనంతరం తిరిగి పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది.  వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జగన్ 3,211 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

 

- Advertisement -