23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబే దళారుల కెప్టెన్! నా జీవితం ప్రజాసేవకే: ‘అన్నపిలుపు’లో జగన్

చంద్రబాబే దళారుల కెప్టెన్! నా జీవితం ప్రజాసేవకే: ‘అన్నపిలుపు’లో జగన్

ys jagan
- Advertisement -

ys jagan

చిత్తూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళారుల కెప్టెన్‌ అయ్యారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని హాజరైన తటస్థులను కోరారు. సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విఙ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు ప్రస్తావించిన సమస్యలపైనా జగన్ స్పందించారు. మద్దతు ధర లభించడం లేదని, దళారుల ఆగడాలు పెరిగిపోయాయని ఓ రైతు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

తాను చేసిన ప్రజాసంకల్ప యాత్రలో రైతు సమస్యల గురించి ప్రస్తావించినట్లు జగన్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకులు గల్లా, ఆదికేశవులు కుటుంబానికి చెందిన శ్రీని ఫుడ్స్, పక్కనే హెరిటేజ్‌ ఫుడ్స్‌.. ఇవన్నీ కూడా రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేశారని.. ఇలా చేస్తే.. ఇక రైతులకు ఎలా మద్దతు ధర వస్తుందని జగన్ ప్రశ్నించారు. ఈ సమస్యపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.

‘కెప్టెన్‌గా ఉన్నవాడు దళారీలకు సహకరిస్తే మద్దతు ధర రాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దళారీలకు కెప్టెన్‌ అయ్యాడు’ అని జగన్ దుయ్యబట్టారు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలకు చంద్రబాబే కొనుగోలు చేసి.. నాలుగు రెట్లకు ప్యాక్‌ చేసి అమ్ముతున్నాడని అన్నారు. వైయస్ హయాంలో రైతులకు లభించిన ధరలు రైతులందరికీ తెలుసని, ఆయన బాటలో రూ. 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడుతున్నామని జగన్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

- Advertisement -