
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. అమరావతిలో నిన్న సాగునీటి ప్రాజక్టులపై జగన్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజక్టుని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఇక ప్రాజెక్టు పనులపై రాష్ట్రం ఖర్చు చేసిన రూ.4,810 కోట్ల నిధులను కేంద్రం నుంచి వెంటనే రాబట్టడానికి ప్రయత్నించాలని అధికారులను కోరారు. అయితే కేంద్రం నిధులు విడుదల చేసేలోగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేద్దామని, ఈ ప్రాజెక్టు పూర్తిచేయడం అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు.
త్వరలోనే తాను పోలవరం ప్రాజక్టును సందర్శిస్తానని చెప్పారు. అలాగే ఈ సందర్భంగా అధికారులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ప్రాజెక్టులకు అధికవ్యయం చేసి రాష్ట్ర ఖజానాకు గండికొడితే చూస్తూ ఊరుకోబోమని, తన ప్రభుత్వంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని, అవినీతి జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ నెల 6న మరోసారి ప్రాజక్టుల వారీగా సమీక్షలు చేపడదామని, అధికారులు, ఇంజినీర్లు తనతో వాస్తవ వివరాలను చెబితేనే బాగుంటుందని అన్నారు.
ఇక ప్రాజక్టుల్లోని కొన్ని పనులకు రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని అధికారులకు సూచించారు. అంతేగాకుండా, ప్రాజక్టు వ్యయం 20 శాతం తగ్గించే అధికారులు, ఇంజినీర్లకు సన్మానం చేస్తామని వారిని ప్రోత్సహించేలా మాట్లాడారు.








