కర్నూలు: చిరు వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులుపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని, వారికి రూ.10వేల వరకు వడ్డీలేని రుణం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొని ప్రసంగించారు. పోలీస్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులతోపాటు హోంగార్డులకు మెరుగైన వేతనాలతోపాటు వారానికి ఒక రోజు సెలవు ఇస్తామని ప్రకటించారు. నవరత్నాలతో ప్రతీ ఒక్కరి జీవితంలో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు.
పచ్చచొక్కాను విప్పుతాం..
ఈ సందర్భంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ బాసులకు సీఎం చంద్రబాబు వేసిన పచ్చ చొక్కాను విప్పుతామని జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేయని మోసమంటూ ఉండదని, ఆయన జిమ్మిక్కులకు మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు బాబు హయాంలో ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేరలేదని జగన్ ఆరోపించారు. కర్నూలు జిల్లా అభివృద్ధిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. సరైన ధర లేక ఉల్లిని రోడ్డుపైనే రైతులు వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. ఉల్లి, టమాటా, పత్తి రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ఆదోని నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి సమస్య ఉందని, నాలుగు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. ఐదేళ్లుగా నీళ్లు అడుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
చదవండి: నారా లోకేష్‌పై పోటీ, చివరి నిమిషంలో జనసేన ట్విస్ట్.. కారణాలివే!
ఆ తేడా కూడా తెలియదు, మూడు శాఖలకు మంత్రి: లోకేశ్‌పై వైఎస్ షర్మిల షాకింగ్…








