చంద్రబాబుకిదే నా సూటి ప్రశ్న: వివేకా హత్యపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

10:31 am, Sun, 17 March 19
ys jagan

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌ను ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం కలిసింది. శుక్రవారం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, టీడీపీ హయాంలో జరుగుతున్న రాజకీయ హత్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

నిజాలు బయటికి రావాలంటే..

అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై గవర్నర్ నర్సింహన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వివేకానంద హత్య కేసులో నిజాలు బయటికి రావాలంటే సీబీఐకి అప్పగించాలన్నారు.

చంద్రబాబు హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు రిపోర్టు చేయని వ్యవస్థతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా మారిందని ఆరోపించారు.

ఏపీ సర్కారు జరిపే విచారణపై తమకు నమ్మకం లేదని అన్నారు. అంతేగాక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగకపోతే కోర్టుకు వెళతామని జగన్ స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలో హత్యకు గురైన విషయం తెలిసిందే.