28.2 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ నేను చూశా, విన్నా, ఉన్నా.. వచ్చేది మన ప్రభుత్వమే: జగన్, ‘మోసంలో బాబు పీహెచ్‌డీ’

నేను చూశా, విన్నా, ఉన్నా.. వచ్చేది మన ప్రభుత్వమే: జగన్, ‘మోసంలో బాబు పీహెచ్‌డీ’

YS Jagan election campaign in Kurnool district, Newsxpressonline
- Advertisement -

కర్నూలు: నెల రోజుల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసం చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని అన్నారు. మరోసారి బాబు మాయమాటలకు మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను దగ్గరి నుంచి చూశానన్నారు. రాష్ట్రంలో అవినీతి హెచ్చు మీరిపోయింది. గుడి నుంచి బడి దాకా మొత్తం అవినీతి అయింది’ అని జగన్ మండిపడ్డారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చారా?. ప్రజలకు అండగా ఉండే వారైతే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేవారా? అని జగన్ ప్రశ్నించారు. బెల్టు షాపులు మూసివేయిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది?. మేం అధికారంలోకి వస్తే బెల్టు షాపుల బెండు తీస్తామన్నారు.

గత ఐదేళ్లలో ప్రజలను అన్ని విధాలా సీఎం మోసం చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని రకాలుగా మోసపోయారని జగన్ అన్నారు. ముఖ్యంగా రుణమాఫీ పేరుతో రైతులను, మహిళను చంద్రబాబు మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించారు. మోసంలో సీఎం చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారు.

చూశా, విన్నా, ఉన్నా…

ఎన్నికలు వస్తున్నాయనే మహిళలకు, రైతులకు వివిధ పథకాల రూపంలో డబ్బులిస్తున్నారు, దీనిని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు.

‘ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకూ రాష్ట్రంలో ప్రజల కష్టాలు స్వయంగా చూశాను. మీ బాధలు, సమస్యలు విన్నాను. పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ అందరి గుండె చప్పుడు విన్నా. నాలుగైదు రోజుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తా. మీ అందరికీ చెబుతున్నా… నేనున్నానే భరోసా ఇస్తున్నా’ అని ప్రజలకు జగన్ స్పష్టం చేశారు.

చంద్రబాబు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. మీ గ్రామాల్లోకి వెళ్లి అందరికీ చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చేరూ.3 వేలు చూసి మోసపోవద్దు. మన పార్టీ అధికారంలోకి వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడని జగన్ చెప్పారు.

‘ఇరవై రోజులు ఓపిక పడితే మన ప‍్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు అన్నింటినీ అన్న భరిస్తాడు అని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు చెప్పాలి. అలాగే రైతన్నకు చెప్పాల్సిన బాధ్యత మీదే. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలు ప్రతి ఊరు, ఇల్లు, గడప గడపకూ తీసుకువెళ్లండని జగన్ పిలుపునిచ్చారు.

పాణ్యం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పి.బ్రహ్మానందరెడ్డికి మీ ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’ అని వైఎస్ జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి
చేశారు.

 

- Advertisement -