

గుంటూరు: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు శనివారం పోలీసులు నోటీసులు ఇచ్చి తమ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అక్టోబర్ 26న వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ జగన్‌పై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తేనని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. శ్రీనివాస్‌రావు టీడీపీ కార్యకర్త అనడానికి తన దగ్గర సాక్ష్యాలు కూాడా ఉన్నాయంటూ అతని సభ్యత్వ నమోదు కార్డును విడుదల చేశారు. అయితే శ్రీనివాస్‌రావు టీడీపీ కార్యకర్త కాదని ఆ సభ్యత్వ నమోదు కార్డు నకిలీ అని టీడీపీ ఆరోపిస్తుంది.
వర్ల రామయ్య ఫిర్యాదుతో…
ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు జిల్లా ఆరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా జోగి రమేష్ వ్యాఖ్యాలు ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఈ విషయంమై కేసు నమోదు చేసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు నోటీసులు అందజేశారు.
జగన్‌పై దాడి ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న తమ విచారణకు హజరుకావాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు పంపిన నోటీసుల్లో ఆదేశించారు. జగన్‌పై హత్యాయత్నం చేసింది టీడీపీ కార్యకర్తలే అని చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలు సమర్పించాలని నోటీసులో తెలిపారు.
న్యాయపరంగా ఎదుర్కొంటా: జోగి రమేశ్
మరోవైపు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ నేత జోగి రమేశ్ స్పందించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, విచారణను నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా టీడీపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై పోరాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వేధింపులను న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు.








