తూర్పుగోదావరి: మహిళా సాధికారత, స్వావలంబన సాధించాలంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కుటుంబాలను సమర్థంగా నడిపే ఆడపడుచులు సమాజాన్ని నడపలేరా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం అన్నవరం సమీపంలోని గౌరీ కళ్యాణ మండపంలో డ్వాక్రా సంఘాలతో పవన్ సమాశమయ్యారు.
ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డ్వాక్రా సంఘాల సభ్యురాళ్లు మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఆయన మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన కార్యకర్తల పేర్లు తొలగిస్తున్నారు…
రుణాలు మాఫీ కాకపోవడం వల్ల వడ్డీలు పెరిగి అప్పు మరింత పెరిగిందని పలువురు మహిళలు వాపోయారు. అంతేకాదు, స్థానిక టీడీపీ నాయకులు చెప్పిన గ్రూపులకే రుణాలు మంజూరు చేస్తున్నారని, అవి కూడా సగం సగం రుణాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనలో పనిచేస్తున్న మహిళా సభ్యురాళ్లను ఆయా గ్రూపుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు.
అనంతరం డ్వాక్రా సంఘాల మహిళల సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలు ప్రజల కోసమే తప్ప పార్టీల కోసం కాదన్నారు. ఏ పార్టీ అయినా ప్రజలకు అండగా ఉండాలని అంటూ.. 2019లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీలకు అతీతంగా డ్వాక్రా సంఘాలకు అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.
బ్యాంకు ప్రతినిధులే మీ ఇళ్లకు వచ్చి…
‘‘మీరు ఏ పార్టీ జెండా మోసినా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. బ్యాంకు ప్రతినిధులే మీ ఇళ్లకు వచ్చి రుణాలు ఇచ్చే పరిస్థితిని జనసేన పార్టీ తీసుకొస్తుంది..’’ అని హామీ ఇచ్చారు.
ప్రజల దప్పిక తీర్చాలని ఒక జనసైనికురాలు చలివేంద్రం పెడితే కుండలను పగలగొట్టే దుస్థితికి తెలుగుదేశం పార్టీ నాయకులు దిగజారారంటే వాళ్లెంత అభద్రతా భావంలో ఉన్నారో అర్థమవుతుందన్నారు. ఓటమి భయం ఉన్న వాళ్లకే అభద్రతాభావం ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గెలిచినా, ఓడినా.. మన పని మనం చేసుకుంటూపోతే.. ఆ పనే మనల్ని గెలిపిస్తుందని, ఆ పనే మనల్ని అధికారంలో కూర్చోబెడుతుందని అన్నారు.
అక్కచెల్లెళ్లతో కలిసి పెరిగిన వాడిని…
అక్కచెల్లెళ్లతో కలిసి పెరిగిన వాడిని కనుక తనకు మహిళల కష్టాలు బాగా తెలుసని, కష్టమైనా, నష్టమైనా జనసేన పార్టీ మహిళలకు అండగా నిలుస్తుందని చెప్పారు. డ్వాక్రా సంఘాల మహిళలకు కూడా రాజకీయ అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా తను మహిళలకు వడ్డీలేని రుణాలు ఎలా ఇవ్వాలనే అంశంపై ఆలోచిస్తున్నానని, త్వరలోనే డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై
ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు.