అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాకూటమి’ ఖర్చంతా టీడీపీ భరిస్తోందని, కూటమి అభ్యర్థులకు చంద్రబాబే ఫైనాన్స్ చేస్తున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.
అసలే ఓటుకు నోటు కేసుతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబును తాజాగా వైసీపీ చేస్తోన్న ఆరోపణలు ఉలిక్కిపడేలా చేశాయి. ఇటీవల అమరావతిలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో సమావేశం అవడానికి, మహాకూటమి ఖర్చుకు లింకు పెట్టారు విజయసాయిరెడ్డి.
మహాకూటమి అభ్యర్థులందరికీ చంద్రబాబు ఫైనాన్షియర్ గా మారాడని చెప్పడానికి అశోక్ గెహ్లాట్‌తో జరిగిన సమావేశమే నిదర్శనమని కూడా విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. మహాకూటమికి వెయ్యి కోట్లు ఇచ్చేలా చంద్రబాబు డీల్ కుదుర్చుకున్నారని, ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన డబ్బులు కాదా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికలకు మహా కూటమి అభ్యర్ధులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్. కాంగ్రెస్ నేత గెహ్లాట్ రాహుల్ దూతగా అమరావతి వచ్చి బాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యం ఇదే. మొత్తం మీద 1000 కోట్లు పెట్టడానికి డీల్. ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభం కదా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2018
కోడికత్తి ముఠా తప్పించుకోలేదు…
అంతేకాదు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై విజయసాయి రెడ్డి చేసిన మరో ట్వీట్ కూడా హాట్ టాపిక్ గా మారింది.
‘వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. పింగళి దశరథ రామ్‌ను, రాఘవేంద్ర రావును, మల్లెల బాబ్జీని, వంగవీటి రంగాను చంపించిన, ఇంకా ఎంతోమంది హత్యలకు పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు. కానీ జననేత వైఎస్ జగన్ హననానికి
ప్రయత్నించిన కోడికత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు..’ అని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కుప్పకూలుతుంది.పింగళి దశరథ రామ్‌ను,రాఘవేంద్ర రావును,మల్లెల బాబ్జీని,వంగవీటి రంగాను చంపించిన,ఇంకా ఎందరి హత్యలకో పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు.కానీ జననేత జగన్ గారి హననానికి ప్రయత్నించిన కోడి కత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2018