అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో ఇటీవల చోటు దక్కించుకున్న కిడారి శ్రవణ్ బుధవారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల మావోయిస్టుల దాడిలో మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. కాగా… ఆయన కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కిడారి కుమారుడు శ్రవణ్‌కి మంత్రివర్గంలో చోటు కల్పించారు.
ఈ నేపథ్యంలో.. బుధవారం శ్రవణ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ముందుగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, 15 గిరిజన రెసిడెన్సీ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై నూతన మంత్రి శ్రవణ్ సంతకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రవణ్ మాట్లాడుతూ.. “సీఎం చంద్రబాబుగారు నాకు చాలా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. నా శాఖ పరంగా గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి తెలుసుకుంటాను.. గిరిజన సంక్షేమం కోసం కృషి చేస్తాను..” అని అన్నారు.