ఏలూరు: బ్యాంకులకు రూ.6 వేల కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సుజనా చౌదరి వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ నేత రోజా ప్రశ్నించారు.
ఏలూరులో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీని నాశనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణనూ నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన జనసేనాని ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత కూడా పవన్ కళ్యాణ్‌కు లేదని రోజా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు హత్యారాజకీయాలు…
ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తన తనయుడు నారా లోకేశ్‌కు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందనే భయంతోనే సీఎం చంద్రబాబు హత్యారాజకీయాలకు తెర తీశారంటూ ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష నేత మీదే హత్యయత్నం జరిగిందంటే.. ఏపీలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని రోజా వ్యాఖ్యానించారు.
అంతేకాదు, జగన్‌పై దాడి జరిగినప్పుడు నిష్పక్షపాత విచారణకు ఆదేశించాల్సిన చంద్రబాబు.. అలా చేయకుండా.. వాళ్లలో వాళ్లే దాడి చేసుకున్నారంటూ వెటకారంగా మాట్లాడారని, అదే దాడి ఆయన కుమారుడు లోకేశ్‌పై జరిగి ఉంటే అలాగే మాట్లాడే వారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు కాళ్ల దగ్గర జర్నలిజం తాకట్టు…
‘మోడీ చేతిలో జగన్’ అంటూ.. ఓ దొంగ పత్రిక ఈ రోజు ఓ కథనం ప్రచురించిందని, అదెవరు రాయించారో అందరికీ తెలిసిందేనన్నారు. కొంతమంది మీడియా పెద్దలు జర్నలిజాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగింది ఎవరో ప్రజలకు తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు, దమ్ముంటే వైఎస్ జగన్ అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని ఆమె టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.