విజయవాడ: ‘ఆపరేషన్ గరుడ’ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఏడు నెలల క్రితం తెరపైకి వచ్చిన ఆపరేషన్ గరుడ.. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నంతో వెలుగులోకి వచ్చింది.
ఆపరేషన్ గరుడలో భాగంగానే వైఎస్ జగన్‌పై దాడి పేరుతో నాటకాలాడుతున్నారని టీడీపీ పార్టీ ఆరోపిస్తుంటే.. ఈ గరుడకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం అంతా చంద్రబాబేనంటూ వైసీపీ నేతలు అంటున్నారు. ఆపరేషన్ గరుడ కుట్రలో భాగంగానే వైఎస్ జగన్‌పై దాడి జరిగిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
నిన్నమొన్నటి వరకు మాటలకే పరిమితమైన ఈ ఆపరేషన్ గరుడ వ్యవహారం.. ఇప్పుడు పోలీసుల దగ్గరకు చేరింది. విజయవాడకు చెందిన వైసీపీ నేతలు మల్లాది విష్ణు, గౌతంరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు..పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ఆపరేషన్ గరుడ పేరుతో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరపాలంటూ ఫిర్యాదు చేశారు.
ఆపరేషన్ గరుడలో భాగంగా వైెెఎస్ జగన్‌పై దాడి జరగబోతోందని చెప్పిన శివాజీకి ఆ విషయం అతడికి ముందే ఎలా తెలుసో కూడా తేల్చాలన్నారు. అవసరమైతే అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వినతి పత్రం కూడా అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ‘‘వైఎస్ జగన్‌పై దాడి కేసులో హీరో శివాజీ పాత్ర కూడా ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. శివాజీని ఉపయోగించి చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.
ఆ కుట్రలో భాగంగానే జగన్‌పై హత్యాయత్నం జరిగిందంటున్నారు. శివాజీ ఆపరేషన్ గరుడపై చెప్పడం… జగన్ పై శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం.. శివాజీ ముందే చెప్పాడంటూ చంద్రబాబు సమర్ధించడం ఈ కుట్రకు నిదర్శమన్నారు. శివాజీకి ముందస్తుగా ఈ సమాచారం ఎలా వచ్చిందని, ఇది అందించిన వారు ఎవరో శివాజీ బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు.