సముద్రంలో కుప్పకూలిన విమానం.. అందులో 188 మంది ప్రయాణికులు!

Flight JT 610
- Advertisement -

Flight JT 610

జకార్తా: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బాంకా బెలిటంగ్ దీవులలో ప్రధాన నగరమైన పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్‌ ఎయిర్‌ జెట్‌ పాసింజర్‌( జేటీ-610) బోయింగ్ 737 విమానం సముద్రంలో కుప్పకూలింది.

జకార్తా నుంచి సుమంత్రాకు టేక్‌ ఆఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది.  సోమవారం ఉదయం 6.20 గంటలకు జకార్తా విమానాశ్రయం నుంచి 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు,  ఐదుగురు సిబ్బందితో లయన్‌ ఎయిర్‌ జెట్‌ పాసింజర్‌( జేటీ-610) విమానం సుమత్రా దీవుల్లోని పంకకల్ పినాంగ్‌కు బయల్దేరింది.

అయితే టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే అంటే 6.33 గంటలకు విమానానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయని జకార్తా విమానాశ్రయ అధికారులు తెలిపారు. అదృశ్యమైన విమానం కాసేపటికే జావా సముద్రంలో కుప్పకూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సముద్ర తీరానికి కొద్ది దూరంలోనే ఈ విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది.

విమాన శకలాల గుర్తింపు..

ఈ ఘటనపై తక్షణమే స్పందించిన జకార్తా అధికారులు అదృశ్యమైన విమానం కోసం గాలింపు చేపట్టారు. తీరానికి సమీపంలో లయన్‌ ఎయిర్‌ జెట్‌ పాసింజర్‌( జేటీ-610) శకలాలను గుర్తించినట్లు తెలిపారు. ‘‘విమానంలో ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది అనేది మేం ఇప్పుడే చెప్పలేం. కానీ సాధ్యమైనంతవరకు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తాం’’ అని అధికారులు తెలియజేస్తున్నారు.

నిజానికైతే 6.20 గంటలకు బయల్దేరిన ఈ విమానం.. 7.20 గంటలకే పంకకల్ పినాంగ్‌‌కి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంతలోనే ఈ ప్రమాదం సంభవించింది. ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. విమాన శకలాల వద్దకు సహాయ బృందాలు చేరుకున్న దృశ్యాలను ఓ నేవీ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

- Advertisement -