
అమరావతి: ఏపీలో గత నెల 11న ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రజల నాడి మొత్తం ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది. కౌంటింగ్ రోజు కోసం అన్ని పార్టీల నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఎవరికీ వారే అధికారంలోకి వచ్చేది తామే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు 100 సీట్లకి పైగా టీడీపీ గెలుచుకోబోతుంది అని చెప్తుంటే, మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా వైసీపీ విజయం పక్కా అని చెప్తున్నాడు. ఇకపోతే ప్రస్తుత రాష్ట్ర సర్వేలు, జాతీయ సర్వేలు అన్ని కూడా వైసీపీకే ముద్దుగా ఉండటంతో వైసీపీ నేతలతోపాటుగా కార్యకర్తలలో కూడా జోష్ నిండింది.
ముఖ్యంగా వైసీపీ నేతలు అధికారం ధీమా వ్యక్తం చేయడానికి గల కారణాలని ఒకసారి చూస్తే… జగన్ చేసిన పాదయాత్ర, అలాగే వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు, టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే వైసీపీకి అధికారం తెచ్చిపెడుతుంది అని బలంగా నమ్ముతున్నారు.
చదవండి: లగడపాటి సర్వే టీడీపీకి అనుకూలంగానే ఉంటుందా?
దీంతో ఎలాగూ అధికారం వైసీపీదే అని తెలియడంతో జగన్ మంత్రి వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. జిల్లాల వారీగా, కీలక నేతలని ఎంచుకొని అన్ని కులాలకు న్యాయం చేసేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక అసలు విషయానికొస్తే… కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాలలో చాలావరకు మెజారిటీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంటుంది అనే అంచనాకి వస్తున్నారు. ఈ సమయంలో జగన్‌కి ఆప్తుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి జగన్ క్యాబినెట్‌లో ఆర్థిక శాఖ ఖాయం అనే మాటలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొడాలి నాని దీనిపై స్పందిస్తూ… తాను వైసీపీ గెలుపు కోసం కృషి చేశానని, తాను రాజకీయాలలో ఉన్నంతకాలం వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇక మంత్రి పదవి ఇచ్చేది, లేనిది పార్టీ అధినేత నిర్ణయమని, జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా తప్పక దాన్ని ఫాలో అవుతానని చెప్పాడు.








