30.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీడీపీకి బిగ్ షాక్: వైసీపీలోకి ఎంపీ తోట నర్సింహం దంపతులు, జగన్ హామీ, రేపే ముహూర్తం

టీడీపీకి బిగ్ షాక్: వైసీపీలోకి ఎంపీ తోట నర్సింహం దంపతులు, జగన్ హామీ, రేపే ముహూర్తం

Thota-Narasimham
- Advertisement -

హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాలో అధికార టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి తోట వాణి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తోట దంపతులు ఆ పార్టీలో చేరనున్నారు.

టీడీపీలో అన్యాయం జరిగింది..

ఈ సందర్భంగా తోట వాణి మాట్లాడుతూ.. టీడీపీలో తమకు అన్యాయం జరిగిందని చెప్పారు. తన భర్తకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదని, ఆయన అనారోగ్య కారణాల దృష్టా తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరినా చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వాపోయారు. ఇక వైసీపీలో తమకు సముచిత స్థానం కల్పిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

‘ఈ మధ్య చంద్రబాబు నుంచి కబురు వచ్చింది. నా భర్త అనారోగ్యం వల్ల వెళ్ళలేకపోయాం. ఈ విషయాన్ని మా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకు చెప్పాను. అప్పటి నుంచి జిల్లా టీడీపీ నేతలు కనీసం నా భర్తను పలకరించలేదు. వాళ్ళను చూస్తే కనీసం మానవత్వం లేదా అనిపించింది’ అని వాణి వాపోయారు.

అంతేగాక, ‘తోట నరసింహం చిన్న వ్యక్తి కాదు. గత పదిహేనేళ్లుగా రాజకీయాల్లోనూ.. ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు’ అని వాణి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జగ్గంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తోట వాణి భావించగా.. ఈ టికెట్‌ను వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు దాదాపు ఖరారు చేయడం గమనార్హం.

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బాబ్జీ

వైసీపీలో ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి(బాబ్జీ) మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో బాబ్జీ భేటీ అయ్యారు. అనంతరం పార్టీలో చేరిన ఆయనను వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

చదవండి: జగన్ పార్టీలోకి బడా పారిశ్రామికవేత్త: పీవీపీకి ఆ లోక్‌సభ సీటు ఖాయమే!
- Advertisement -