అమరావతి: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెల్సిందే. 175 స్థానాల్లో పోటీ చేసి ఆ పార్టీ కేవలం 23 స్థానాలని గెలుచుకుంది. ఇక 25 పార్లమెంట్ స్థానాలకి గాను 3 స్థానాలని గెలుచుకుంది.
ఈ క్రమంలోనే టీడీపీ ఓటమిపై జూన్ 4వ తేదీ నుంచి చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. తొలుత విజయవాడ లోక్ సభ, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన వారిని పిలిచి ఓటమికి కారణాలను అడిగి తెలుసుకోనున్నారు.
ఇదిలా ఉంటే, ఓటమి అనంతరం ఇంటికే పరిమితమైన చంద్రబాబుని పలకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున అమరావతికి వస్తున్నారు. ఇక వచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్న చంద్రబాబు, వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబుని చూసిన కొందరు మహిళలు భావద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంటున్నారు. అయితే ఓటమికి కుంగిపోవద్దని, అధైర్యపడితే మరింతగా నష్టపోతామని, తన వద్దకు వచ్చిన పలువురు మహిళలను చంద్రబాబు ఓదార్చారు.








