న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ‘ఓటుకు నోటు’ కేసులో విచారణ ఫిబ్రవరికి వాయిదా పడింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఇరువైపు వాదనలు విన్న జస్టిస్ బి లోకూర్ ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి నెలకు వాయిదా వేసింది.
టీడీపీ అధికార దాహానికి ప్రతీకగా నిలిచిన ఓటుకు నోటు కేసులోసీబీఐతో దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ వాదించారు.
ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అనంతరం ఈ కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉంటాయని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ మదన్‌బీ లోకూర్.. ఆ విషయంలో తామేమీ చేయలేమని, ఫిబ్రవరిలో విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు నోటు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఒక నివేదిక కూడా ఇచ్చింది.
‘ఓటుకు కోట్లు కేసులో సత్వర విచారణ కోసం తాను చేసిన విఙ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించిందని, ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు ఉన్నాయని, కావున విచారణను వాయిదా వేయాలన్న చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్దార్థ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది..’’ అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తెలిపారు.