ముంబై: దేశవ్యాప్తంగా ‘మీటూ’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమం ద్వారా పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెడుతున్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు సాజిద్ ఖాన్ తనను వేధించాడని తాజాగా నటి సలోనీ చోప్రా ఆరోపించింది. ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు ఆరోపణలు చేసింది.
సాజిద్ నిజస్వరూపం గురించి విని కూడా, ఓ సమావేశం నిమిత్తం నేను ఆయన ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని చెబుతూ.. సలోనీ చోప్రా నాటి ఘటనను గుర్తు చేసుకుంది. తనను సాజిద్ ఖాన్ చీకటిగా ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్లాడని.. బయట కూర్చుందామని తాను అడిగితే, అక్కడే ఉన్న వాళ్ల అమ్మకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడని పేర్కొంది.
ముద్దు పెడితే డబ్బులిస్తానంటూ…
ఆయన ప్రవర్తనపై తనకు అనుమానం వచ్చి, తాను ఓ పోలీసు అధికారి కుమార్తెనని అబద్ధం చెప్పానని, అయినా కూడా అతడు తన వేధింపులు మానుకోలేదని సలోనీ తెలిపింది. ముద్దు పెడితే డబ్బులిస్తానంటూ అతడు తన సంభాషణ మొదలెట్టాడని, తాను లొంగకపోవడంతో.. చివరికి రూ.100 కోట్లు ఇస్తా.. శునకంతో శృంగారం చేస్తావా? అని అడిగాడని ఆరోపించింది.
కోరిక తీర్చకపోయే సరికి..
తాను గట్టిగా నిలదీసేసరికి.. ఇక లాభం లేదనుకుని లైట్లు వేశాడని, సాజిద్ ఖాన్ లైంగిక కోరికలు తీర్చేందుకు తాను మొండిగా నిరాకరించానని సలోనీ చోప్రా నాటి సంగతులను వివరించింది. అతడి కోరిక తీర్చకపోయే సరికి.. తన గొంతు బాగాలేదని, అతిగా ఆలోచిస్తుంటానని చెబుతూ, ముఖ్యమైన పాత్రలకు తనను దూరం చేశాడని కూడా ఆరోపించింది.
మరోవైపు, ప్రముఖ నిర్మాత, దర్శకుడు సాజిద్ ఖాన్‌పై లైంగిక ఆరోపణలు పెరిగిపోతుండడంతో.. అతడ్ని ‘హౌస్ ఫుల్ 4’ దర్శక బాధ్యతల నుంచి నిర్మాణ సంస్థ తప్పించింది.