25.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విశాఖ వైసీపీ నేత హత్యకు కుట్ర.. రూ.10 లక్షలకు ఒప్పందం.. సుపారీ గ్యాంగ్ అరెస్ట్

విశాఖ వైసీపీ నేత హత్యకు కుట్ర.. రూ.10 లక్షలకు ఒప్పందం.. సుపారీ గ్యాంగ్ అరెస్ట్

- Advertisement -

విశాఖపట్టణం: నగరానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మొదలవలస చిరంజీవిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం సంచలనంగా మారింది. చిరంజీవిని హత్య చేసేందుకు 10 లక్సల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న గ్యాంగ్.. ముందుగా 4 లక్షల రూపాయలను అడ్వాన్స్‌గా తీసుకుంది. అడ్వాన్స్ మొత్తం చేతికి రాగానే రంగంలోకి దిగిన సుపారీ గ్యాంగ్ పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు.

చిరంజీవి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు సమాచారం అందుకున్నటాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా వేసి నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన రౌడీషీటర్ కన్నబాబు సహా మొత్తం 9మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

అధికార పార్టీ నేత అయిన కన్నబాబుది శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల. అమ్మినాయుడు, తేజేశ్వరరావు అనే వ్యక్తులతో చిరంజీవికి భూవివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను హత్య చేయాలని అమ్మినాయుడు, తేజేశ్వరరావులు నిర్ణయించారు. ఇందులో భాగంగా విశాఖకు చెందిన ప్రకాశ్‌ అనే వ్యక్తిని కలిసి, అతడి సాయంతో రౌడీషీటర్ కన్నబాబును ఆశ్రయించారు. విషయం చెప్పి చిరంజీవి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం 10 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోగా, అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు ఇచ్చారు.

అడ్వాన్స్ తీసుకున్న కన్నబాబు.. చిరంజీవి హత్యకు పథకం రచించాడు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన రౌడీషీటర్ పరమేశ్ సాయం తీసుకున్నాడు. అతడితో కలిసి చిరంజీవి హత్యకు రెక్కీ నిర్వహించాడు. అతడికి చెందిన పూర్తి సమాచారం సేకరించారు. ఏ సమయంలో ఎక్కడ ఉంటాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడు అన్న వివరాలను సేకరించి హత్యకు రెడీ అవుతున్న సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టారు. దీంతో మొత్తం ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -