అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా, వాటి వివరాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.
కేంద్రానికి మూడు లేఖలు…
ఏపీ విభజన హామీల అమలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రెండు లేఖలు, టిట్లీ తుపాను సాయంపై కేంద్ర హోం మంత్రికి మరో లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తోంది అనడంకంటే మోసం చేస్తుందని అనడం సబబని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్రం పెద్దలకు లేఖలు రాద్దామని ఆయన సూచించారు. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
విభజన ఒప్పందంలో భాగంగా కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదని, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యమేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
దీనిని నిరసిస్తూ కేంద్రానికి మొదటి లేఖ రాయాలని కేబినెట్‌లో తీర్మానించారు. అలాగే కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, తక్షణం వాటన్నింటినీ అమలు చేయాలని రెండో లేఖ రాయాలని.. ఇక టిట్లీ తుపాను విషయంలో కూడా కేంద్రం వైఖరిపై కేంద్ర హోం మంత్రికి ప్రత్యేకంగా మరో లేఖ రాయాలని నిర్ణయించారు.
కడపలో స్టీలు ప్లాంటు నిర్మాణం…
కడపలో స్టీలు ప్లాంటు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఇక దీని నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వమే వంద శాతం పెట్టుబడి వ్యయాన్ని భరించాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఏర్పాటుకు మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. వచ్చే నెలలో దీనికి పునాదిరాయి వేయాలని కూడా నిర్ణయం తీసుకుంది.
గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సీఎండీగా పని చేసిన పి.మధుసూదన్‌ను కడపలో ఏర్పాటు చేయబోయే ఉక్కు కర్మాగారానికి సీఎండీగానియమించాలని కూడా ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.
అవసరమైతే ఈక్విటీకి వెళ్లాలని, ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలతో సంయుక్త ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా కేబినెట్ అభిప్రాయపడింది. కడప ఉక్కు కర్మాగార నిర్మాణ వ్యయం అంచనా రూ. 12 వేల కోట్లుకాగా, దీనికి ప్రాథమిక పెట్టుబడిగా కేబినెట్ రూ. 2 కోట్లు కేటాయించింది.
విశాఖ మెట్రో ఏర్పాటుకూ…
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ మెట్రో ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని సత్వరం ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సబంధించిన ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందంపై గతంలో జారీచేసిన ఉత్తర్వులకు ఆమోదం తెలపడంతోపాటు ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందాన్ని విడుదల చేయడానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) మేనేజింగ్ డైరెక్టరుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్…
అలాగే ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణానికి 2395.98 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకీ ఉచితంగా కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
దొనకొండ మండలం రాగమక్కపల్లి, భూమనపల్లి, రుద్రసముద్రం, ఇండ్లచెరువు గ్రామాల పరిధిలోని ఈ భూమిని దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణం కోసం ప్రకాశం జిల్లా ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌కు అప్పగించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.