

అమరావతి: అందరూ ఊహించినట్లుగానే మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌కు ఆయన రాజీనామా లేఖను అందజేయగా, అదేరోజు సాయంత్రం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
అనంతరం తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా టీడీపీ కార్యాలయానికి తన రాజీనామా లేఖను పంపించారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న రావెల కిషోర్ బాబు.. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పలుమార్లు సమావేశమైనట్లు తెలుస్తోంది.
జనసేనలో చేరిక లాంఛనమే…
జనసేనలో చేరికపై పలు దఫాలుగా చర్చించిన తరువాతే ఆయన తన రాజీనామాను ప్రకటించినట్లు చెబుతున్నారు. రేపు.. అంటే శనివారం రావెల కిషోర్ బాబు నాగార్జున యూనివర్సిటీ నుంచి అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీతో బయలుదేరి విజయవాడ వెళ్లి.. అక్కడ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.
రావెల కిషోర్ బాబు మాజీ ఐఆర్‌ఎస్ అధికారి. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచిన ఆయన అనూహ్యంగా కేబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత రావెల పనితీరు, జిల్లా నేతలతో సమన్వయ లోపం, గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్మన్ జానీమూన్‌తో వివాదంతో పార్టీలో ఆయనపై అసంతృప్తి మొదలయ్యింది.
వరుస వివాదాలు చుట్టుముట్టడంతో.. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కేబినెట్ విస్తరణలో కిషోర్ బాబు మంత్రి పదవి కోల్పోయారు. అప్పట్నించి టీడీపీ అధిష్ఠానంపై ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులు క్రితం రావెల వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన ఆ పార్టీలో చేరలేదు. చివరికి జనసేన వైపు మొగ్గు చూపారు. ఇక జనసేనలో ఆయన చేరిక లాంఛనమేనని తెలుస్తోంది.








