అప్పటి జగన్ కాదు: వైసీపీలో చేరిన మరో స్టార్ హీరో.. ఏమన్నారంటే..?

10:54 am, Mon, 1 April 19
YCP Latest News, Jagan Latest News, AP Latest Political News, Newsxpressonline

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సినీతారల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం ఉదయం ప్రముఖ నటుడు రాజశేఖర్‌ దంపతులు కలిశారు.

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ భేటీ జరిగింది. అనంతరం రాజశేఖర్‌ మాట్లాడుతూ…‘చాలా రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌ను కలిశాను. మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయి’ అని స్పష్టం చేశారు.

నాకు శత్రుత్వం లేదు..

అంతేగాక, ‘అప్పట్లో నేను అపరిపక్వతతో ప్రవర్తించాను. నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి. అవి తొలగించుకోవడానికే ఆయన దగ్గరకు వచ్చాను. అప్పటి జగన్‌ ఇప్పటి జగన్‌ వేరు. ఇప్పటికే ఆయనను కలవడం ఆలస్యం అయింది’ అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

పాదయాత్రలో జగన్ ప్రజల బాధలు, కష్టాలు తెలుసుకున్నారని తెలిపారు. యువకుడైన వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తామని రాజశేఖర్ చెప్పారు. అనంతరం జీవితా రాజశేఖర్ మాట్లాడారు.

ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఆశపడద్దని ఓ‍టర్లకు ఆమె సూచించారు. రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలంటే అది వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. కష్టపడకుండా కొడుకును సీఎంను చేయాలనుకునేవారు మనకొద్దని, జగన్‌లాంటి కష్టపడేవాళ్లు మనకు కావాలని జీవిత అన్నారు.

కాగా, 2009లో రాజశేఖర్, జీవితలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జగన్ వైసీపీ పెట్టడంతో ఆ పార్టీకి మద్దతు పలికారు. అయితే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో విభేదాల కారణంగా బీజేపీలో చేరారు. గతేడాది చంద్రబాబుకు మద్దతు పలికిన రాజశేఖర్, జీవితా దంపతులు తాజాగా వైసీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

చదవండి: రాక్‌స్టార్‌ గా అవతరించిన వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి !