26.7 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home క్రికెట్ చెన్నై హ్యాట్రిక్..ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై విజయం!

చెన్నై హ్యాట్రిక్..ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై విజయం!

MSD
- Advertisement -

చెన్నై: డిఫెండింగ్‌ చాంప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ధోనీ (46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 నాటౌట్‌) తనదైన మార్క్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో.. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 పరుగులతో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 175/5 స్కోరు చేసింది. సురేష్‌ రైనా (32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 36), బ్రావో (27) సహకారం అందించారు. జోఫ్రా ఆర్చర్‌ (2/17) రెండు వికెట్లు పడగొట్టాడు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి వరకు పోరాడిన రాజస్థాన్‌.. 167/8 స్కోరు మాత్రమే చేసింది. బెన్‌ స్టోక్స్‌ (26 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 46) పోరాటం చేశాడు.

ఛేదనలో చెన్నై కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ ఆరంభంలో విలవిల్లాడింది. తొలి ఓవర్‌లో రహానెను డకౌట్‌ చేసిన దీపక్‌ చాహర్‌.. తర్వాతి ఓవర్‌లో ప్రమాదకర సంజూ శాంసన్‌ (8)ను వెనక్కిపంపి రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (6)ను శార్దూల్‌ ఠాకూర్‌ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. దీంతో 14/3తో మూడు టాపార్డర్‌ వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ కష్టాల్లో పడింది.

అయితే, రాహుల్‌ త్రిపాఠి (24 బంతుల్లో 5 ఫోర్లు సిక్స్‌తో 39), స్మిత్‌ (28) జట్టు బాధ్యతలు భుజాన వేసుకున్నారు. శాంట్నర్‌ 6వ ఓవర్‌లో త్రిపాఠి రెండు ఫోర్లు, సిక్సర్‌తో స్కోరు వేగం పెంచాడు. ఒకవైపు త్రిపాఠి భారీ షాట్‌లు ఆడే ప్రయత్నం చేస్తే.. స్మిత్‌ మంచి సహకారం అందించాడు. 7వ ఓవర్‌లో త్రిపాఠి ఫోర్‌ బాది స్కోరును 50 పరుగులు దాటించాడు.

అయితే, 10వ ఓవర్‌లో త్రిపాఠిని తాహిర్‌ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. స్మిత్‌ను కూడా తాహిర్‌ పెవిలియన్‌ చేర్చడంతో రాయల్స్‌ ఆశలు అడుగంటాయి. కానీ, కృష్ణప్ప గౌతమ్‌ (9)తో కలసి బెన్‌ స్టోక్స్‌ స్కోరు బోర్డు నడిపించాడు.ఈ దశలో స్టోక్స్‌కు జత కలసిన ఆర్చర్‌ (24 నాటౌట్‌) చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బ్రావో 18వ ఓవర్‌లో స్టోక్స్‌ 6, 4 బాదాడు. ఆఖరి ఓవర్‌లో 6 బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా.. స్టోక్స్‌ను అవుట్‌ చేసి బ్రావో మ్యాచ్‌ చేజారకుండా అడ్డుకున్నాడు. చివరి ఆరు బంతుల్లో స్టోక్స్‌, గోపాల్‌ను అవుట్‌ చేసిన బ్రావో.. మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మందకొడి పిచ్‌పై టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆరంభంలో 27/3తో టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయి తడబడినా.. మిస్టర్‌ కూల్‌ ధోనీ అజేయ అర్ధ శతకంతో రాణించడంతో చెన్నై సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. రాయల్స్‌ బౌలర్ల దెబ్బకు ఓపెనర్లు రాయుడు (1), వాట్సన్‌ (13)తోపాటు కేదార్‌ జాదవ్‌ (8) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా సురేష్‌ రైనా (36), ధోనీ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును నడిపించారు. అయితే, 14వ ఓవర్‌లో రైనాను అవుట్‌ చేసిన ఉనాద్కట్‌ (1/54) జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. స్లో బంతితో సురే్‌షను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఈ దశలో క్రీజులో ఉన్న ధోనీకి బ్రావో (16 బంతుల్లో 27) మంచి సహకారం అందించడంతో 16వ ఓవర్‌లో స్కోరు 100 పరుగులు దాటింది. ఆర్చర్‌ వేసిన 17వ ఓవర్‌ ఫోర్‌ బాదిన ధోనీ స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశాడు. 18వ ఓవర్‌లో కులకర్ణి బౌలింగ్‌లో ధోనీ సిక్స్‌.. బ్రావో 4,6 బాదడంతో ఆ ఓవర్‌లో 24 పరుగులు లభించాయి. అయితే, బ్రావోను అవుట్‌ చేసిన ఆర్చర్‌ (2/17).. ఐదో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆఖరి ఓవర్‌లో జడేజా (8 నాటౌట్‌), ధోనీ నాలుగు సిక్స్‌లు బాది 28 పరుగులు పిండు కోవడంతో జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. ధోనీ దెబ్బకు చివరి 3 ఓవర్లలో రాజస్థాన్‌ 60 పరుగులు సమర్పించుకుంది

- Advertisement -