

హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
హైదరాబాద్లోని లోటస్పాండ్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో మేడా ఆ పార్టీలో చేరనున్నారు. గత ఆరు నెలలుగా మేడా మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు రఘునాథరెడ్డి వైసీపీతో సంప్రదింపులు జరుపుతున్నారని కడప జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా, మంత్రి ఆదినారాయణ రెడ్డితో విభేదాలే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీని వీడటానికి కారణంగా తెలుస్తోంది.
టీడీపీ నుంచి మేడా సస్పెన్షన్…
టీడీపీ నుంచి మేడా మల్లికార్జునరెడ్డిని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు. కడప జిల్లా రాజంపేట, జమ్మలమడుగు నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు ఇటీవల తన నివాసంలో సమావేశమయ్యారు. మేడాను సస్పెండ్ చేయాలని ఆ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్ చేయడంతో.. మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ఆ సమావేశంలోనే ప్రకటించారు.








