26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ బ్యాలెట్టే కావాలి!: విపక్షాల డిమాండ్, రాహుల్ పక్కనే చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేశారు

బ్యాలెట్టే కావాలి!: విపక్షాల డిమాండ్, రాహుల్ పక్కనే చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేశారు

rahul-babu
- Advertisement -

rahul-babu

న్యూఢిల్లీ: వచ్యే సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్నిఅమలు చేయాలంటూ మరోసారి విపక్షాలన్నీ ఏకమయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్‌సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ల నేతృత్వంలో శుక్రవారం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో విపక్షాల సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈవీఎంలపై నెలకొన్న సందేహాలపై చర్చించి ఒక నివేదికను ఆమోదించారు.

అంతేగాక, దీనిపై సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించాయి. బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని, సాధ్యం కాకపోతే వీవీప్యాట్‌లనైనా పూర్తిగా లెక్కించాలని కోరనున్నాయి. ఈ అంశంతోపాటు రైతాంగ సమస్యలు, నిరుద్యోగం, రఫేల్‌ కుంభకోణం గురించీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తీర్మానించినట్లు… సమావేశానంతరం రాహుల్‌గాంధీ, చంద్రబాబు మీడియాకు వెల్లడించారు.

సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ… ‘ఈవీఎం వ్యవస్థ గురించి చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. దాన్ని పరిష్కరించడానికి ఒక బ్యాకప్‌ వ్యవస్థ ఏర్పాటుచేయాలి. అప్పుడే ఏం జరుగుతోందన్న విషయం ప్రజలకు తెలుస్తుంది. ఓటర్లకు ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కనీసం 50% వీవీప్యాట్‌లనయినా లెక్కించాలన్నదే మీ డిమాండా? అన్న మీడియా ప్రశ్నకు… దానిపైనే చర్చిస్తున్నామన్నామని రాహుల్ చెప్పారు.

కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. రైతాంగం, నిరుద్యోగం, వ్యవస్థల విధ్వంసం, రఫేల్‌ కుంభకోణాలు ఎక్కడికీ పోలేదని, ఇవన్నీ ఎన్నికల అంశాలుగా ఉంటాయని అన్నారు. మోడీ ప్రభుత్వంపై రెండునెలల తర్వాత ప్రజలే మెరుపుదాడిచేస్తారన్నారు. అవినీతి అతిపెద్ద ఎన్నికల అంశమని చెప్పారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు: చంద్రబాబు

సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అన్ని రాజకీయపార్టీలు 15 రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈవీఎంల సమస్యపై ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించిన తర్వాత వారి స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. 23 పార్టీల సమావేశంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న వ్యవసాయ సంక్షోభంపై కూడా చర్చించినట్లు చెప్పారు. కేంద్రం వ్యవస్థలను విధ్వంసం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

ఇక ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తులుండవని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు రాజకీయ అనివార్యత వల్ల కలిసి పనిచేసే పరిస్థితి లేకపోయినా జాతీయస్థాయిలో అందరూ కలిసి పనిచేస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. తాము ప్రస్తుతం ఏ విధంగా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్న దానిపైనే దృష్టిపెట్టినట్లు ప్రకటించారు. చంద్రబాబు అమరావతికి తిరిగి వెళ్లేముందు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు.

- Advertisement -