
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలతోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. మార్చి 23న ఆయన నామినేషన్ వేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే వైసీపీ తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు.
పీవీపీనే బలమైన అభ్యర్థి…
అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో వైసీపీ అధిష్ఠానం కూడా అంగీకరించినట్లు తెలిసింది. సీటుపై క్లారిటీ రావడం, జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పీవీపీ వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, విజయవాడ లోక్‌సభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఇటీవల దాసరి జైరమేశ్ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. అయితే, ఆయన పోటీకి సుముఖంగా లేకపోవడంతో ఇప్పుడు పీవీపీ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పొట్లూరి అయితేనే బాగుంటుందని పార్టీ నేతలు కూడా భావించినట్లు తెలిసింది.
ఇది ఇలా ఉండగా, ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుకు టికెట్ కేటాయింపుపై కూడా స్పష్టమైన హామీ ఇవ్వనట్లు సమాచారం. దీంతో ఆయన మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.








