ప్రధాని ఎవరనేది అప్రస్తుతం.. మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే: రాహుల్‌తో భేటీ అనంతరం మీడియాతో చంద్రబాబు

chandrababu
- Advertisement -

rahul-chandrababu-delhiఅమరావతి/ఢిల్లీ: దేశ భవిష్యత్తును, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు అందరిపైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై కాంగ్రెస్ అధినేత రాహెుల్ గాంధీ, తాను చర్చించామని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత.. దేశ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీపైన, దేశంలో ఒక సీనియర్ నేతగా తనపైన ఉందని చెప్పారు.

అంతకుముందు ఢిల్లీలో రాహుల్, చంద్రబాబు గంటకు‌పైగా భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరూ కలసి మీడియా ముందుకొచ్చారు. తొలుత రాహుల్ మాట్లాడగా, ఆ తరువాత చంద్రబాబు మాట్లాడారు.

దేశ రక్షణ కోసం చేతులు కలిపాం…

కాంగ్రెస్, టీడీపీ కలవడంపై కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయని… కానీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో, దేశాన్ని రక్షించడం కోసం తాము చేతులు కలిపామని ఆయన వివరించారు. దేశంలో బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తామని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని బాబు పేర్కొన్నారు.

ఇలాంటి పాలనను నా జీవితంలో చూడలేదు…

బీజేపీ పరిపాలనను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని… ఇంతటి దారుణమైన పాలనను తన జీవితంలో చూడలేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతోందో అందరూ గమనిస్తున్నారని… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడమే కాకుండా, కీలక వ్యవస్థలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

సీబీఐ, సుప్రీంకోర్టు, ఆర్బీఐలతో పాటు గవర్నర్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి…

ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చించాలని కూడా రాహుల్ ను కోరుతున్నానని చంద్రబాబు తెలిపారు. భావసారూప్యత ఉన్న పార్టీలన్నింటితో సమావేశమై… కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో.. ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పని చేస్తాయని తెలిపారు.

మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరవుతారు అని విలేకరులు ప్రశ్నించగా.. అది అప్రస్తుతమని, సెన్సేషనల్ వార్తల కోసం ప్రయత్నించవద్దని సూచించారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని… హోదాకు రాహుల్ మద్దతు పలికారని చెప్పారు. తామిద్దరి లక్ష్యం ఒక్కేటేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

- Advertisement -