

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. జనసేనతో టీడీపీ పొత్తు ఉండే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొనడంపై అటూ జనసేన ఇటు తెలుగుదేశం అధినేతలు తీవ్రంగా స్పందించారు. టీడీపీ గురించి టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ తరహా ప్రకటనలతో కార్యకర్తలను అయోమయానికి గురిచేయొద్దని స్పష్టం చేశారు. పార్టీ విధానాలపై మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు పార్టీ నేతలకు ఘాటుగా సూచించారు.
అసలు టీజీ వెంకటేష్ ఏమన్నారంటే..
చంద్రబాబుతో సమావేశం అనంతరం బుధవారం ఉదయం టీజీ వెంకటేష్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని అన్నారు. కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే రెండు పార్టీలకు అభిప్రాయ భేదాలున్నాయని వ్యాఖ్యానించారు.
సీఎం కుర్చీపై ఆశ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ ప్రశ్నించారు. అంతేగాక, టీడీపీతో జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిచేవాళ్లకే అవకాశాలు ఇస్తారని.. ఈ క్రమంలో తన కుమారుడికి కూడా అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు టీజీ చెప్పారు.
టీజీ వెంకటేష్‌కు పవన్ కళ్యాణ్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-టీడీపీ కలిసేందుకు అవకాశాలు ఉన్నాయన్న టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలిపెట్టబోమని, బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాము వద్దనుకుంటేనే టీజీ వెంకటేష్‌కు చంద్రబాబు రాజ్యసభ సీటును ఇచ్చారని చెప్పారు.
‘నా నోరు అదుపుతప్పితే మీరు ఏమవుతారో కూడా నాకు తెలియదు’ అని పవన్ కళ్యాణ్ ఘాటుగా హెచ్చరించారు. విశాఖ మన్యంలో టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. టీజీ వెంకటేష్ తన వయసుకు తగ్గట్లు పెద్దమనిషిగా మాట్లాడాలనీ, లేదంటే తాను నోరు అదుపుతప్పి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.
కర్నూలులో పర్యావరణాన్ని అడ్డగోలుగా కలుషితం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దమనిషి అనే మర్యాద ఇస్తున్నానని అన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో తాను మద్దతు ఇస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇందుకోసం టీడీపీ నుంచి తాము ఏదీ ఆశించలేదని గుర్తుచేశారు. టీడీపీ వ్యవహారశైలితో విసిగిపోయామనీ, ఆ పార్టీ ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ గేమ్ మొదలుపెట్టిందని దుయ్యబట్టారు.








