
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోలాహలానికి నేటి నుంచి మొదలవుతోంది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వెంటనే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 21న హోలీ, 24 ఆదివారం.. సెలవు దినాలు కావడంతో ఆ రెండురోజులూ నామినేషన్ల స్వీకరణ ఉండదు.
మార్చి 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27, 28 రెండు రోజుల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించి.. మే 23న ఫలితాలు విడుదల చేస్తారు.
తొలి విడతలో 91 స్థానాలకు ఎన్నికలు..
కాగా, ఈ విడతలో ఏపీ అసెంబ్లీతోపాటు 25 ఎంపీ, తెలంగాణలో 17 సహా మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తిచేశామని ఈసీ అధికారులు తెలిపారు.
ఇది ఇలావుంటే, ఓటు నమోదు కోసం ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు మార్చి 15తో ముగిసింది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే ఓటర్ల తుది జాబితాను అధికారులు మార్చి 25న ప్రకటించనున్నారు. తుది జాబితా ప్రకటన నాటికి ఓటర్ల సంఖ్య కాస్త అటూఇటూగా 2.98 కోట్లకు చేరుతుందని అంచనా.








