కుప్పం: ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తమ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్ధులని ఒకేసారి ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ బరిలోకి దింపింది.
మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి వరుసగా రెండోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై పోటీ చేసిన చంద్రమౌళి ఓటమి చవిచూశారు.
విజయం అంత ఈజీ కాదుగా…

అయినా మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.1989 నుండి కుప్పం నుండి చంద్రబాబు నాయుడు విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుండి చంద్రబాబునాయుడు బరిలోకి దిగుతున్నారు.
గత ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో తొలిసారిగా మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. తొలిసారి చంద్రబాబునాయుడుపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు 47 వేల మెజారిటీతో విజయం సాధించారు.
తాజాగా మరోసారి చంద్రబాబుపై పోటీకి దిగుతున్నారు చంద్రమౌళి. ఇక 2004, 2009 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై కాంగ్రెస్ అభ్యర్ధి సుబ్రమణ్యరెడ్డి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.








