విజయవాడ: వచ్చే నెల 23న అనూహ్య ఫలితాలు వెల్లడికాబోతున్నాయని ప్రముఖ సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ముగిసిన ఏపీ ఎన్నికలపై ఆయన తాజాగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన శివాజీ బీజేపీ, వైసీపీలపై మరోమారు విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్కు 16, జగన్‌కు 17 లోక్‌సభ స్థానాలు వస్తాయని, తొలి విడత జరిగిన పోలింగ్‌లో ఎన్డీయేకు 39 సీట్లు వస్తాయని బీజేపీ సరికొత్త డ్రామాకు తెరతీసిందని అన్నారు. ఈ మొత్తం సీట్లన్నీ తమవేనని బీజేపీ ప్రచారం చేసుకుంటోందని, శుక్రవారం నుంచి ఈ నాటకాన్ని మరింత ఉద్ధృతం చేసిందన్నారు. ఇందులో భాగంగానే జగన్ బెస్ట్ సీఎం అంటూ వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పొగుడుతున్నారని విమర్శించారు.
ఈ ప్రచారంలో వాస్తవం లేదని, అవన్నీ ఊహాగానాలేనని శివాజీ తేల్చి చెప్పారు. మే 23న ఎవరూ ఊహించని అనూహ్య ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ, బీజేపీ దుష్ప్రచారాన్ని ఎవరూ పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబు వ్యూహాన్ని చివరికి ఆ పార్టీ నేతలు కూడా అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్న శివాజీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అధ్భుత ఫలితాలు రాబోతున్నాయని శివాజీ మరోమారు స్పష్ట చేశారు.
చదవండి: బీహార్‌ను తలపించిన ఏపీ.. కారణం ఇదేనా?