ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. కృష్ణా జిల్లా ఫస్ట్, కడప జిల్లా లాస్ట్..

ap-inter-results-2019-declared
- Advertisement -
అమరావతి: ఏపీలో ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో 60 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం విద్యార్తులు ఉత్తీర్ణత సాధించారు. అయితే ఫలితాల్లో బాలురు కన్నా బాలికలే పైచేయిగా నిలిచారు.

మొదటి సంవత్సరంలో 64 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలురు 56 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ద్వితీయ విషయానికొస్తే.. బాలికల ఉత్తీర్ణత 75 శాతంగా ఉండగా, బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు.

అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 49 శాతం విద్యార్థులు, రెండో సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు ముగిసిన 24 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం.. అందులోనూ తొలిసారిగా గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలను విడుదల చేయడం విశేషం.

ap-inter-results-2019-released-by-udayalakshmiఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,423 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 10,17,600 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5,07,302 మంది, సెకండియర్ విద్యార్థులు 5,10,298 మంది ఉండగా, పరీక్షలకు మాత్రం 9.65 లక్షల మంది విద్యార్థులే హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులుకాగా, మిగిలిన 3.3 లక్షల మంది విద్యార్థులు పరీక్షలో ఫెయిలయ్యారు.

అగ్రస్థానంలో కృష్ణా, చివరి స్థానంలో కడప…

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా నుంచి ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ఫస్టియర్ విద్యార్థులలో 81 శాతం, సెకండియర్ విద్యార్థులలో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలువగా, తరువాతి స్థానాల్లో.. పశ్చిమగోదావరి – 69 శాతం, నెల్లూరు – 67 శాతంతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఇక ఫలితాలలో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

9,340 మంది విద్యార్థులు 10/10 సీజీపీఏ సాధించగా.. 99,857 మంది విద్యార్థులు 9/10 సీజీపీఏ సాధించారు. 62,376 మంది అభ్యర్థులు 7/10 సీజీపీఏ సాధించారు. ప్రభుత్వ కాలేజీ ఉత్తీర్ణతలో 77 శాతంతో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.

ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా (81 %) జిల్లా తర్వాత.. చిత్తూరు జిల్లా 76 శాతంతో రెండో స్థానంలో నిలువగా, నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 74 శాతం ఉత్తీర్ణత శాతాలతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.

- Advertisement -