
అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఇలా ప్రమాణం చేశారో లేదో…అప్పుడే పాలనలో తన మార్క్ చూపించడం మొదలైంది. జగన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అధికారుల స్థానాలు చకచకా మారిపోయాయి. తాజాగా ఏపీ సచివాలయంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.
గత సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్రతో పాటు ముఖ్య కార‍్యదర్శి సాయి ప్రసాద్, సీఎం కార్యదర్శులు గిరిజా శంకర్, రాజమౌళిలను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శిగా కె.ధనుంజయ్ రెడ్డిని నియమించారు.
ఇక ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితులను పట్టించుకోకుండా చేసిన పనులతో రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడిందని సీఎస్ పేర్కొన్నారు.
అలాగే ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన ప్రాజక్టు పనుల్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరైనా, ఇంకా ప్రారంభించని పనులు ఏవైనా ఉంటే వాటిని రద్దు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రభుత్వంపై అదనపు భారం తగ్గనుంది. అలాగే 25 శాతం పనులు పూర్తవని ప్రాజక్టుల విలువను నిర్ధారించాలని, వాటికి తదుపురి బిల్లుల చెల్లింపులు చేయరాదని తన ఆదేశాల్లో వివరించారు.








