
హైదరాబాద్: ఇటీవల వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒకే సీటుని గెలుచుకుంది. ఇక ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసి ఓటమి పాలవ్వగా, నాగబాబు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో జనసేన ఓటమిపై నాగబాబు…తన యూట్యూబ్ చానల్ ‘మై చానల్ నా ఇష్టం’ ద్వారా స్పందించారు. జనసేన ఓటమికి ఎవరూ చింతించాల్సిన పనిలేదన్న ఆయన.. పార్టీ గెలుపు కోసం పనిచేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అయితే జనం క్లీన్ పాలిటిక్స్ కోరుకుంటున్నారని, తాము పైసా కూడా పంచకుండానే లక్షల ఓట్లు సాధించినట్టు చెప్పారు.
జనసేన గెలవకున్నా నైతికంగా తాము గెలిచామని, ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధగానే ఉందన్న నాగబాబు.. బాధపడడం లేదని చెప్పడం అబద్ధమే అవుతుందన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌కు అభినందనలు తెలియజేశారు. ఏపీకి సుపరిపాలన అందించాలని, తమ సహకారం జగన్‌కు ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. ఇక జగన్ ఇచ్చిన నవరత్నాల హామీని ఈ ఐదేళ్లలో నిలబెట్టుకుని ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలన్నారు.








