
అమరావతి: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ 151 సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 31న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ క్రమంలోనే జగన్ శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ని, ఆదివారం ప్రధాని మోడీని కలిసి తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికలని అందించారు. ఇక నిన్న మోడీతో భేటీ అయిన జగన్… ఏపీలో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. రాష్ట్రానికి ఆర్దికంగా తోడ్పాటుతో పాటుగా ఏపీకీ ప్రత్యేక హోదా పైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని..తమ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఇదిలా ఉంటే తన ప్రమాణ స్వీకారానికి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఈ మేరకు తానే చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. అలాగే పార్టీ ప్రతినిధులతో చంద్రబాబుకి ఆహ్వానం పంపిస్తారని విశ్వసనీయ సమాచారం.
ఏది ఏమైనా ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని..పాలనా పరంగా అందరినీ కలుపుకు పోతేనే రాష్ట్ర అభివృద్ధికి కలిసొస్తుందని జగన్ భావిస్తున్నారు. ప్రతిపక్ష నేతని కూడా తన ప్రమాణ స్వీకారానికి పిలిచి పరిణితి చెందిన రాజకీయ వేత్తను అని నిరూపించుకోవాలని జగన్ భావిస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబుని పిలుస్తారా…అలాగే పిలిచిన చంద్రబాబు వస్తారనేది.








