అమరావతి: ఏపీ పీడీ అకౌంట్స్‌లో అవినీతి జరిగిందంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సోమవారం చేసిన ఆరోపణలపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. ‘టీవీ9’లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎల్ మాట్లాడుతూ, జీవీఎల్ చెప్పిన 6 కార్పొరేషన్లలో పైసా దారిమళ్లిందని రుజువైనా తాను స్వచ్ఛందంగా అరెస్టవుతానని, ఒకవేళ రుజువు కాకపోతే జీవీఎల్ అరెస్టవుతారా? అని సవాల్ విసిరారు.
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‌లో రూపాయి దారిమళ్లినా తనపై తానే దర్యాప్తు వేసుకుంటానని, ప్రతి బుడబుక్కలోడు ఎంక్వైరీలు అడుగుతుంటే పరిపాలన చేయాలా? లేకుంటే ఇవన్నీ చూస్తూ కూర్చోవాలా? అంటూ కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇరవై నాలుగు గంటల్లో లేఖ పంపమనండి, వివరణ ఇస్తాం, మా సమాచారమంతా తొంభై శాతం ఆన్‌లైన్‌లో ఉంటుంది..’’ అని అన్నారు. అంతేకాదు, కాగ్ నివేదిక కేంద్ర ప్రభుత్వంపై ఒక్క కామెంట్ కూడా చేయకుండా పునీతంగా ఉందా? అని కూడా కుటుంబరావు ప్రశ్నించారు.
నిప్పులు చెరిగిన మంత్రి యనమల…
ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలపై మంత్రి యనమల రామకృష్ణుడు కూడా మండిపడ్డారు. పీడీ అకౌంట్స్ అంటే ఏమిటో జీవీఎల్‌కు తెలియదా? పీడీ ఖాతాల్లో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఆర్థిక పరిజ్ఞానం కూడా లేకుండా రాజ్యసభలో జీవీఎల్ ఏం చర్చలు చేస్తారు? పీడీ ఖాతాలకు 2జీ కుంభకోణానికి పోలిక ఏమిటీ? అంటూ జీవీఎల్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 72,652 పీడీ ఖాతాలు నిర్వహించేవారు, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు 43,374 పీడీ అకౌంట్లు వచ్చాయని యనమల తెలిపారు. ఈ ఖాతాల్లో అత్యధికం పంచాయతీలు, స్థానిక సంస్థలకు చెందినవేనని, 13, 14 ఆర్థిక సంఘం నిధులను వేరుచేసేందుకు 13, 199 పీడీ ఖాతాలు తెరిచామని, ఏజీ నివేదిక ప్రకారం మార్చి 31 నాటికి పీడీ ఖాతాల్లో రూ.29,909 కోట్లు ఉన్నాయని అన్నారు.
పీడీ ఖాతాల్లో పారదర్శకత కోసం పోర్టల్ కూడా ప్రారంభించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12,822 పీడీ అకౌంట్లు తొలగించామని, కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూ, ట్రెజరీలో నిధులు ఉంచుతున్నామని మంత్రి యనమల స్పష్టం చేశారు.