

పుట్టపర్తి: మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా న్యాయం జరగకపోతేనే ఉద్యమాలు పుట్టుకొస్తాయని, ఆకలితోనే యువత ఉద్యమాల వైపు ఆకర్షితులవుతారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ పరిస్థితులు మారాలంటే రాజకీయ వ్యవస్థ మారాలని, రాజకీయ వ్యవస్థ మారాలంటే యువత ఆలోచన విధానం కూడా మారాలని ఆయన వ్యాఖ్యానించారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడగూరు మండలం గుండువారిపల్లి గ్రామంలో పవన్ కల్యాణ్ రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి… రైతులు, సామాన్యుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రెయిన్ గన్‌లు అంటూ హడావిడి చేసి…
కరవు తీవ్రతకి గ్రామాలకి గ్రామాలు వలసబాట పట్టాల్సి వస్తోందనీ, రెయిన్ గన్‌లు ఇస్తున్నామని హడావిడి చేసి, ముఖ్యమంత్రి వచ్చి వెళ్లగానే వాటిని పీక్కుపోయారని రైతులు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ముందు వాపోయారు.
దీంతో చలించిపోయిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “పవన్ కల్యాణ్ ఎక్కడ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతూ వస్తున్నారు. మీడియాలో కనిపించడానికి ఆయనలా మనకు పేపర్లు, ఛానళ్లు లేవు. జనసైనికుల ఫేస్ బుక్ , వాట్సాప్‌లే మనకు ఛానళ్లు, పేపర్లు..’’ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ‘‘అయ్యా సీఎం గారు… రెయిన్ గన్‌ల పేరు చెప్పి రైతులను ఎక్కడ మోసం చేశారో ఆ గుండువారిపల్లి నుంచే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ వర్షాలు లేవు, నీరు లేదు. పంటలు మొత్తం ఎండిపోయాయి. తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. అవి మీకు కనబడుతున్నాయా? అమరావతిలో కూర్చుని రాయలసీమని సస్యశ్యామలం చేశామంటే ఎలా..?’’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ప్రశ్నించారు.
మంత్రి పంటి వైద్యానికి రూ.3.5 లక్షలా…?
‘‘మంత్రి యనమల పంటి వెద్యానికి రూ.3.5 లక్షల ప్రజాధనం ఖర్చుచేశారు. ఏం ఆయనకు ఆస్తులు, అంతస్తులు లేవా..? ఒకవైపు ప్రజలు గూడు లేక రోడ్డున పడుతుంటే… నాయకుల వ్యక్తిగత అవసరాలకు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు..’’ అని ప్రశ్నించారు.
అలాగే ‘‘ఇక్కడ చూస్తే.. పంటని తడపాలంటే తల్లడిల్లిపోయే పరిస్థితి. నేను మీవాడిని.. మీ సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా. ఇక్కడ కరవు పరిస్థితులు తెలుసుకుని అమరావతిలో మాట్లాడతా. రాయలసీమలో విపరీతమైన కరవు ఉంది. కరవు ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. కరవు ప్రాంతాల్లో యువతకి ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా పెంచాలి. రైతులు వలసలుపోకుండా గిట్టుబాటు ధర కల్పించే ఏర్పాట్లు చేయాలి..’’ అని పవన్ డిమాండ్ చేశారు.
రాజకీయాల్లోకి వచ్చింది ఓట్ల కోసం కాదు…
‘‘నేను రాజకీయాల్లోకి వచ్చింది ఓట్ల కోసమో, అద్భుతాలు చేస్తానని చెప్పడానికో కాదు. మన సమస్యలు ప్రపంచానికి చెప్పడానికి వచ్చాను. మన పాలకులు సీమ సమస్యను బయటకు ఎలా చెబుతున్నారంటే .. రెయిన్ గన్‌లు పెట్టడం వల్ల కరవు పారద్రోలేశాం, వలసలు ఆగిపోయాయి, కియా మోటర్స్ రావడంతో స్థానికులకు ఉద్యోగాలు వచ్చేశాయని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో అర్థమవుతుంది. రాజకీయ నాయకులకి ఓట్లు వేయించుకోవడంలో ఉన్న ఆసక్తి.. సమస్యలు తీర్చడంలో లేదు..’’ అని పవన్ కల్యాణ్ రైతులతో అన్నారు.
పరిశ్రమలు పెడతామంటే…
అంతేకాదు, ‘‘రాయలసీమ ప్రాంతంలో వలసలు ఆపడానికి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నేను ఎంతో మంది పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతూ ఉంటా. గతంలో యూరోపియన్ బిజినెస్ సమ్మిట్‌కి వెళ్లాను. రేపు అమెరికా వెళ్తున్నా. అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడినప్పుడు వారు చెబుతుంది ఏంటంటే.. పరిశ్రమలు పెడతామంటే మాకు లంచం ఎంతిస్తారు? మాకు షేర్లు ఎంతిస్తారు? అని అడుగుతున్నారట..’’ అని వ్యాఖ్యానించారు.
‘‘అందుకే ఎర్ర కండువా ధరిస్తా..’’
జనసేన పార్టీకి అవేమీ అవసరం లేదని, రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు రావాలని, వలసలు ఆగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. జనసేన పార్టీ సరదా కోసం పెట్టలేదని, సామాన్యుడి సంక్షేమం కోసం పెట్టానని ఆయన పేర్కొన్నారు. మెడలో ఎర్ర కండువా ఎందుకు వేస్తానంటే. అది సామాన్యుడి కండువా. సామాన్యుడి పక్షాన నిలబడతానని చెప్పడానికే ధరిస్తానని జనసేనాని పేర్కొన్నారు.








