
అమరావతి: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న రసాయన వాయువు లీకేజి ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనలో 10 మంది మరణించడం.. అలాగే వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయ విదారకం అంటూ ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు ఒక ట్వీట్ చేసిన జనసేనాని.. విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల అందరూ బాధ్యతగా మెలగాలని జనసేనాని హితవు పలికారు.
విశాఖ దుర్ఘటన హృదయవిదారకం …
•కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి
విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజల భయకంపితులు కావడం…— Pawan Kalyan (@PawanKalyan) May 7, 2020
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా ఉండకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండాలి. కఠినంగా వ్యవహరించాలి. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ నాయకులకు సూచించాను.
— Pawan Kalyan (@PawanKalyan) May 7, 2020








