పవన్ కాళ్యాణ్ కాన్వాయ్‌కి ప్రమాదం.. జనసేన అనుమానం, సీరియస్‌గా విచారణ జరపాలని డిమాండ్…

janasena chief pawan kalyan escaped in road accident
- Advertisement -

janasena chief pawan kalyan escaped in road accidentకాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఆ కారు పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారుకు అతి సమీపంలో ఉంది. అయితే ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్‌.. ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.  రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు కాకినాడ నుంచి వెళ్తుండగా రంగంపేట మండలం రామేశంపేట వద్ద పవన్ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది.

ఎనిమిది మంది భద్రతా సిబ్బందికి  గాయాలు…

జనసేనాని ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలోని సెక్యూరిటీ వాహనాన్నిలారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో  పవన్ ప్రైవేటు భద్రతా సిబ్బంది ఎనిమిది మంది గాయపడ్డారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం.

గాయపడిన వారిని చికిత్సనిమిత్తం రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే పవన్ కళ్యాణ్ ఉన్న వాహనం ముందుకెళ్లిన తరువాత ఈ ప్రమాదం జరగడంతో పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం గురించి తెలియలేదు. దీంతో పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొన్నారు.

ప్రమాదంలో  గాయపడిన వారిలో కె.శ్రీకాంత్‌, జె.రామకిశోర్‌, శివ, నవీన్‌, పి. అరవింద్‌,  జావీద్‌, బాబి, బి. శ్రీకాంత్‌ ఉన్నారు. వీరికి ఎలాంటి ప్రాణపాయం లేకపోవడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద ఘటనపై అనుమానం.. విచారణకు డిమాండ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాద ఘటనపై ఆ పార్టీ సీరియస్‌గా స్పందించింది. కాన్వాయ్‌లోని ప్రైవేట్ సెక్యూరిటీ వాహనాన్ని లారీ ఢీకొట్టడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటనలో పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం తప్పడంతోపాటు గాయాలతో ప్రైవేట్ సిబ్బంది బయటపడటం సంతోషమే అయినా దీనివెనుక ఏదో కుట్ర దాగి ఉందంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ప్రమాద సంఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా విచారణ జరిపి కారణాలు తెలపాలని, లేదంటే దీనిని కుట్రగా భావించాల్సి ఉంటుందని ఆ పార్టీ లీగల్ సెల్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.

- Advertisement -