నెల్లూరు: 30 విదేశీ ఉపగ్రహాలతోపాటు, ఒక స్వదేశీ ఉపగ్రహాన్ని మోసుకుంటూ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం ఉదయం 9.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ43 వాహక నౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.
ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా, కెనడా, కొలంబియా, మలేషియా తదితర దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించారు. నాలుగు దశల్లో ఈ ఉపగ్రహాలను వాటికి సంబంధించిన కక్ష్యల్లోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ ప్రయోగానికి సంబంధించి బుధవారం ఉదయం 5.59 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగింది. అనంతరం పీఎస్ఎల్వీ సీ43 రాకెట్ నిర్దేశిత సమయానికి మూడు దశలను దాటుకుంటూ కక్ష్యలోకి దూసుకెళ్లింది.
ఒకేసారి 31 ఉపగ్రహాలతో…
ఈ రాకెట్ ద్వారా.. అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు.. అలాగే ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్, మలేసియా, నెదర్లాండ్స్, స్పెయిన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. అంతేకాదు, ఈ రాకెట్ ద్వారానే మన దేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ (హెచ్‌వైఎస్ఐఎస్)ను కూడా అంతరిక్షంలోకి ప్రయోగించారు.
విదేశీ ఉపగ్రహాల్లో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. వీటి మొత్తం బరువు 261.5 కిలోలు. ఇక మన దేశీయ ఉపగ్రహం బరువు దాదాపు 83 కిలోలు. వాస్తవానికి ఇస్రో ఈ తరహా ఉపగ్రహాన్ని.. చంద్రయాన్-1 ప్రయోగం అనంతరం తొలిసారిగా 2008 మే నెలలోనే ప్రయోగించింది. ఇది రెండోసారి.
పీఎస్ఎల్వీ సీ43 రాకెట్.. దాదాపు 2 గంటల అనంతరం ఈ ఉపగ్రహాన్ని భూమి నుంచి 630 కీలోమీటర్ల ఎత్తులో.. సూర్య సమస్థితి కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రధాన విభాగమైన అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ డిజైన్ చేయగా, చండీగఢ్‌లోని సెమికండక్టర్ ల్యాబ్‌లో తయారుచేశారు.
అంతరిక్షంలో 630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీయగల ఈ ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, తీర ప్రాంతాల అంచనా, ఇతర భౌగోళిక పరిసరాలకు సంబంధించి వివిధ రకాల సేవలను అందిస్తుంది.