
గన్నవరం: అధికారంలో ఉన్నంత వరకే ఏదైనా అనేది రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే నానుడి, దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విషయంలోనూ ఇది నిజమైంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షంలోకి వెళ్లిన చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్‌లో పైలట్, ఎస్కర్ట్ వాహనాలను తొలగించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో మరో చేదు అనుభవం ఎదురైంది. జడ్‌ప్లస్ కేటాగిరి భద్రతలో ఉన్న చంద్రబాబును సాధరణ ప్రయాణికుల వలే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వాహనం నేరుగా వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉన్నా, వెళ్లనివ్వలేదు.
దీంతో చంద్రబాబు సామాన్య ప్రయాణికుడిలాగే లోపలికి వెళ్లగా, సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను కూడా తనిఖీ చేశారు. అలాగే ఎయిర్‌పోర్టు లాంజ్ నుంచి విమానం వరకు ప్రయాణికులతో కలిసి చంద్రబాబు విమానం దగ్గరకు వెళ్లారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రత ఉన్నా చంద్రబాబుకు అధికారులు ప్రత్యేక వాహనం కేటాయించకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఇలా సామాన్యుడిలా తనిఖీలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోనూ చంద్రబాబు కాన్వాయ్‌కి పైలెట్ క్లియరెన్స్ తొలగించారని, ట్రాఫిక్‌లో బాబు వాహనం ఆగితే భద్రతపరంగా అంత మంచిది కాదని నేతలంటున్నారు. అయితే ఈ తనిఖీల వ్యవహారంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు పౌరవిమానయాన శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ఎంతో హుందాగా ఎయిర్ పోర్ట్ సిబ్బందికి సహకరించారు.
చదవండి: చంద్రబాబుకు షాక్: వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!








