వణికిస్తోన్న‘టిట్లీ’ తుపాను, రెండు జిల్లాల్లో 8 మంది మ‌ృతి, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, తీరం దాటినా…

cyclone-titli
- Advertisement -

అమరావతి: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టిట్లీ తుపాను పెను విధ్వంసమే సృష్టించింది. ఈ తుఫాను కారణంగా ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు.. మొత్తం 8 మంది మరణించారు.  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. 2000 పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

ఫలితంగా పలు ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల మొబైల్, ల్యాండ్ ఫోన్లు పని చేయడం లేదు. తీర ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లో రోడ్లు కూడా దెబ్బతిన్నాయి.  మ‌ృతుల్లో ఆరుగురు సముద్రంలో వేటకు వెళ్లి చనిపోయారు. ఇళ్లు, చెట్లు నేలకూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరోవైపు మత్స్యకారులకు చెందిన రెండు బోట్లు సముద్రంలో  చిక్కుకుపోయాయి.  ఈ బోట్లను ఓడ్డుకు చేర్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.

అత్యంత భారీ వర్షాల దెబ్బకు పలు రైళ్ల రద్దు…

టిట్లీ తుఫాను నేపథ్యంలో గత రాత్రి శ్రీకాకుళం జిల్లాలో ఒక్క గంట వ్యవధిలోనే 20 సెంటీ మీటర్లకుపైగా వర్షం కురిసింది.  అత్యంత భారీ వర్షాల ధాటికి రైల్వే ట్రాకులు సైతం దెబ్బతిన్నాయి. దీంతో పలు రైళ్లు రద్దయ్యాయి. యశ్వంతాపూర్ – హౌరా ఎక్స్‌ప్రెస్, బెంగళూరు – గౌహతి ఎక్స్‌ప్రెస్, యశ్వంతాపూర్ -ముజఫర్ ఎక్స్‌ప్రెస్, పూరీ, విశాఖ మధ్యన తిరిగే పలు ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం – గుణపూర్ పాసింజర్‌ను విజయనగరం వరకు, విశాఖ – న్యూ పలాస పాసింజర్‌ను విజయనగరం వరకు మాత్రమే నడుపుతున్నట్లు  రైల్వే అధికారులు తెలిపారు.

తుపాను కారణంగా వీస్తోన్న పెనుగాలులకు.. మినీ కోనసీమగా పిలిచే ఉద్ధానంలో కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఊగిపోయాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలాస, టెక్కలి ప్రాంతాల్లో పరిస్థితి బీభత్సంగా కనిపిస్తోంది.  మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదులకు వరద తాకిడి బాగా పెరిగినట్లు సమాచారం.

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్…

టిట్లీ తుఫాను నేపథ్యంలో కేంద్రం 21 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోని తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉండడంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బ‌ృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.  మరోవైపు పశ్చిమ బెంగాల్లోనూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపిన కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్‌లను అప్రమత్తం చేసింది.

పరిస్థితిని సమీక్షిస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

టిట్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. తుపాను కారణంగా వేలాది చెట్లు నేలకొరిగాయని, ఆస్తినష్టం భారీగా ఉందని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.  ప్రకృతి విపత్తులను ఆపలేమని, ప్రభుత్వం తరఫున సరైన చర్యలు తీసుకొని కొంతమేర నష్టాన్ని తగ్గించామని ఆయన చెప్పారు. నాలుగేళ్ల క్రితం నాటి హుధుద్ తుఫాను కంటే టిట్లీ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.

తీరం దాటినా…

టిట్లీ తుఫాను గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.00 గంటల నడుమ పలాస వద్ద తీరం దాటింది. ఇది ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు కదిలి, క్రమేపి బలహీనపడి రేపటికి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను తీరం దాటినా కూడా శ్రీకాకుళం జిల్లాలో భారీ గాలులు వీస్తున్నాయి. కళింగపట్నంలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.  గురువారం రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

విద్యుత్ హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే…

టిట్లీ తుపాను నేపథ్యంలో ఈపీడీసీఎల్ పరిధిలో 1912 కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 8331018762. శ్రీకాకుళంలో విద్యుత్ సమస్యలపై 9490612633, 0894222736 నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చు. అలాగే విజయనగరంలో విద్యుత్ సమస్యలపై 94906-10102, 08922-22294 నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చు. ఇక విశాఖపట్నంలో 7282299975, 0891 222942 నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చు.

- Advertisement -