అలీరాజ్‌పూర్: ఆధునిక పోకడలను అనుసరించి ప్రజల వస్త్రధారణలోనూ చాలా మార్పులొచ్చాయి. సంప్రదాయ దుస్తులను పండుగలు, వేడుకల్లో మినహా మిగతా రోజుల్లో చూడటం గగనమైపోయింది. కానీ మధ్యప్రదేశ్‌లోని ‘మాలీ’ తెగకు చెందిన పెద్దలు మాత్రం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ తెగలో పదేళ్లు దాటిన అమ్మాయిలు జీన్స్ ధరించడాన్నివారు నిషేధించారు.
ఈ నిబంధనను శరన్నవరాత్రుల నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా మాలీ తెగ ఏటా ‘గర్బా వేడుకను’ ఘనంగా నిర్వహిస్తుంది. వేడుక సందర్భంగా వందలాది మహిళలు, యువతులు గర్బా నృత్యాన్ని చేస్తారు. అయితే ఈ వేడుకలో పాల్గొనే మహిళలు జీన్స్ ధరించరాదంటూ కొత్తగా నిబంధన విధించారు. ఎక్కవ మంది భక్తులు పాల్గొనే కార్యక్రమం కావడంతో మహిళల పట్ల ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండేందుకు వారు ఈ నిబంధన విధించారు.
‘‘ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా గర్బా వేడుక నిర్వహించలని నిర్ణయించుకున్నాం, అయితే ఇందులో భాగంగా ఈసారి డ్రెస్ కోడ్‌ని విధించాం. ఇకమీదట ఇదే నిబంధన కొనసాగుతుంది. అంతేకాకుండా ఆడపిల్లలు వారి ఇళ్లల్లోనూ జీన్స్ వేసుకోవడం నిషేధం. ఇక ఏ పండుగలకు కూడా వారు వీటిని ధరించడానికి వీల్లేదు..’’ అని అలీరాజ్‌పూర్‌లోని మాలీ వర్గ మహిళా అధ్యక్షురాలు మంజుల తెలిపారు.