25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎంగా తొలిరోజు ఎలా గడిచిందో.. వైఎస్ జగన్ ఏమేం చేశారో తెలుసా!?

ఏపీ సీఎంగా తొలిరోజు ఎలా గడిచిందో.. వైఎస్ జగన్ ఏమేం చేశారో తెలుసా!?

jagan
- Advertisement -

అమరావతి: వైసీపీ.. గత కొన్ని రోజులవరకు తెలుగు రాష్ట్రాలకే తెలిసిన ఈ పేరు.. ప్రస్తుతం దేశం మొత్తం హల్ చల్ చేస్తోంది. దీనికి ఏకైక కారణం వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజకీయ చరిత్రలో మరెవరికి సాధ్యం కానటువంటి, 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సంచలన రికార్డ్ నమోదు చేసాడు.

పార్టీ స్థాపించిన నాటి నుండి తొమ్మిదేళ్ల వరకు నిత్యం ప్రజలకోసం ఎన్నో పోరాటాలు చేసిన వైసీపీ… చివరికి 2019 ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో ఘనవిజయం అందుకుంది. ఇక ఆంధప్రదేశ్ సీఎంగా జగన్ మే 30 న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అతిరథ మహారధుల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

‘జగన్ అనే నేను..’ అనే మాట కోసం గత తొమ్మిదేళ్లుగా వేచి చూసిన వైసీపీ అభిమానులు ఇప్పుడు పట్టరాని సంతోషంలో ఉన్నారు.  ఇకపోతే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ సీఎం కేసీఆర్, అలాగే డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు.

ప్రమాణస్వీకార కార్యక్రమం అయిపోగానే, సీఎం కేసీఆర్‌కి, స్టాలిన్‌కి జగన్ పంచభక్ష పరమాన్నాలతో పసందైన విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఏపీ, తెలంగాణకి సంబంధించిన ప్రత్యేక వంటకాలు అన్నీ వడ్డించారు.

ఇక ముఖ్యమంత్రిగా జగన్ తొలి రోజు ఎలా గడిచిందో ఒకసారి గమనిస్తే… జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన మొదటిరోజు తెల్లవారుజామున 4 గంటలకి లేచి, కాలకృత్యాలు, వ్యాయామం పూర్తి చేసి, ముఖ్యమంత్రి హోదాలో మొదటి రోజు బాధ్యతలని నిర్వర్తించడానికి సిద్ధం అయ్యారు.

సమీక్షలు నిర్వహించే ముందు తండ్రి వైఎస్ఆర్ ఫోటో దగ్గరికి వెళ్లి, తండ్రికి నమస్కరించారు. నువ్వు ఇచ్చిన శక్తి , నీ సంకల్పంతోనే ముందుకు పోతాను అని, ప్రతి విషయంలో తోడుగా ఉంటూ మంచి దారిలో నడిచేందుకు తగిన శక్తిని ఇవ్వాలంటూ కోరుకున్నారు. ఆ తరువాత తల్లి విజయమ్మ దగ్గరికి వెళ్లి కాళ్ళకి నమస్కారం చేసి, ఆమె ఆశీస్సులని తీసుకున్నారు.

ఇక ఆ తరువాత తాడేపల్లిలోని తన నివాసంలోనే జగన్ భేటీలు నిర్వహించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా సీఎం జగన్‌‌ను ఆయన నివాసంలోనే కలుసుకుని చర్చించారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మరికొందరు ఉన్నతాధికారులు కూడా జగన్ ను తాడేపల్లి నివాసంలోనే కలుసుకుని రాష్ట్ర స్థితిగతులపై నివేదికలు సమర్పించారు.

ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి హోదాలో చేసిన తొలి సంతకం.. వైఎస్ఆర్ ఆసరా ఫించన్ పై వైసీపీ ప్రభుత్వం తొలి జీవోని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి జులై 1వ తేదీ నుండి పింఛన్ ఇవ్వబోతున్నారు. అలాగే పింఛన్ తీసుకునే వయస్సుని 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్.

అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ప్రతినెలా 10 వేల రూపాయల పింఛన్ అందజేయబోతున్నట్టు తెలిపారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజిలెన్స్ డీజీగా ఉన్న సవాంగ్‌కు డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో ఇప్పటి వరకు సేవలు అందించిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు.

ఆ స్థానంలో ఉన్న ఉన్న త్రిపాఠీని జీఏడీకి బదిలీ చేశారు. అలాగే, జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -