
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఇప్పటికే టీడీపీ సభ్యత్వానికి, చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన.. శుక్రవారం జగన్‌తో భేటీ అయ్యారు. పార్టీ కండువాతో ఆయనకు జగన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం చల్లా రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిస్వార్థంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు.
రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. టీడీపీలో ఒడిదుడుకులు భరించలేకనే వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. వైఎస్ జగన్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని ప్రశంసించారు. ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు.
చల్లా మాటిస్తే తిరుగేలేదు..
ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని చంద్రబాబును చల్లా ప్రశ్నించారు. చంద్రబాబు తాయిలాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఆయన మాయమాటలకు దూరంగా వచ్చినట్టు చెప్పారు.
తాను వైఎస్సార్, ఎన్టీఆర్ దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశానని చల్లా గుర్తు చేశారు. టీడీపీలో తాను పెద్ద పదవులు అనుభవించలేదని చెప్పారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బతిమాలితే తీసుకున్నానని వెల్లడించారు. తనకు పెద్ద పదవి ఇస్తానని మూడుసార్లు చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడతానని.. కల్మషం, కపటం లేకుండా పనిచేస్తానని చల్లా అన్నారు. కర్నూలులో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేస్తానని.. చల్లా మాట ఇస్తే తిరుగేలేదని స్పష్టం చేశారు. చల్లాతోపాటు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా, కర్నూలు జిల్లాలో పట్టున్న నేతగా పేరున్న చల్లా రామకృష్ణారెడ్డి గతంలో కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.








