
అమరావతి: దేశవ్యాప్తంగా 542 లోక్‌సభ స్థానాలకి జరిగిన ఎన్నికలతో పాటు… ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇక ఏపీలో 36 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 6 చోట్ల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అలాగే ఓట్ల లెక్కింపులో 25వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 14,770 సీసీ కెమెరాలు, 68 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టనున్నారు.
అయితే ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. అలాగే ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక కూడా అవసరం అనుకుంటే రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందన్నారు.
వీవీ ప్యాట్ స్లిప్పులో తేడా వచ్చినప్పుడు, ఈవీఎం డీకోడ్ కానప్పుడు, ఈవీఎంలు మొరాయించినప్పుడు, పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉన్నప్పుడు రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.








