అప్పుడు అన్నీ శాఖల్లోనూ అవినీతి: టీడీపీపై వైసీపీ మంత్రులు ఫైర్

2:06 pm, Sat, 15 June 19
YCP Ministers Latest News, TDP Latest News, AP Political News, Newsxpressonline

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంపై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు ఈరోజు వేర్వేరు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ….గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.

ఏపీ సచివాలయంలో తన ఛాంబర్ లో ఈరోజు అనిల్ కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు.

మాజీ సీఎం చంద్రబాబు హయాంలో వ్యవసాయశాఖలో భారీ అవినీతి చోటుచేసుకుందనీ, తమ ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖలో దోపిడీ ఉండదని స్పష్టం చేశారు.

ఇక మరో సందర్భంలో ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) మాట్లాడుతూ…ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతిని టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహించిందని మండిపడ్డారు. డాక్టర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తే సహించబోమని హెచ్చరించారు.

ఏపీలో రాబోయే రోజుల్లో ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని మంత్రి చెప్పారు. వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు.

అలాగే ఈరోజు ఏపీ మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ… అమరావతితో పాటు వేర్వేరు ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తామని స్పష్టం చేశారు. ఏపీ విభజన తర్వాత పసికందు లాంటి నవ్యాంధ్రను చంద్రబాబు నాశనం చేశారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం