
అమరావతి: ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం మరోషాక్ ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు సెక్యూరిటీగా జెడ్ ప్లస్ కేటగిరీ లో ఉన్న ఎస్కార్ట్, పైలెట్ వాహనాలని తొలగించిన ప్రభుత్వం….తాజాగా గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు భద్రతా సిబ్బందిని తొలగించింది.
టీడీపీ నేతలు కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావును మినహాయిస్తే గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలందరికీ గన్‌మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కూడా గన్‌మెన్లను తొలగించింది.
అయితే.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జిల్లా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గన్‌మెన్లను తొలగించిందని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు. ఆయనకు కేటాయించిన భద్రతలో ఎలాంటి మార్పు లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు కాన్వాయ్‌లోని అడ్వాన్స్ పైలట్ కారు మాత్రమే తొలగించినట్లు తెలిపారు. రోడ్డు క్లియరెన్స్ ఎప్పటిలాగే కొనసాగుతోందని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.








